గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆస్తి పన్ను సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కమిషనర్ ఆర్.వి. కర్ణన్ మార్చి నెలలోని అన్ని ఆదివారాల్లో ప్రత్యేక కార్యక్రమాలను ప్రకటించారు. మార్చి 1, 8, 15, 22,29 తేదీలలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ఈ పరిష్కార వేదికలు అందుబాటులో ఉంటాయి. పన్ను చెల్లింపు దారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా ఉన్నతాధికారులను కలిసి తమ ఫిర్యాదులను పరిష్కరించుకోవచ్చు.
ఈ ప్రత్యేక కేంద్రాలలో డిప్యూటీ కమిషనర్లు, వాల్యుయేషన్ అధికారులు, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు అందుబాటులో ఉంటారు. ఇక్కడ ఆస్తి పన్ను అంచనాల సవరణలు, రివిజన్ పిటిషన్ల పరిష్కారం, ఆన్‌లైన్ లేదా ఆర్‌టీజీఎస్ (RTGS) ద్వారా చెల్లించినప్పటికీ అప్‌డేట్ కాని రశీదుల నమోదు, బకాయిల సవరణలు, ఐజీఆర్‌ఎస్ (IGRS) సంబంధిత అంశాల పరిష్కారం, కోర్టు కేసులపై సూచనలు ,స్వీయ అంచనా (Self-Assessment)లో జరిగిన పొరపాట్ల సరిదిద్దడం వంటి సేవలు అందిస్తారు.
ప్రతి సర్కిల్ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం మూడు ప్రత్యేక కౌంటర్లు, కంప్యూటర్లు , ప్రింటర్లతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేశారు. వచ్చిన వారికి మార్గదర్శనం చేయడానికి రిసెప్షన్ డెస్క్ కూడా ఉంటుంది. అధికారులు స్వీకరించిన దరఖాస్తులను గూగుల్ డ్రైవ్‌లో నవీకరిస్తూ, ప్రతిరోజూ రెవెన్యూ విభాగానికి నివేదికలు పంపాలి. ఈ ప్రక్రియలో ఏవైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.దీర్ఘకాలంగా పన్ను బకాయిలు ఉన్న వారికి ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ గొప్ప అవకాశం కల్పించింది. ‘వన్ టైమ్ సెటిల్మెంట్’ (OTS) పథకం కింద పాత బకాయిలపై పేరుకుపోయిన వడ్డీలో 90 శాతం రాయితీ లభిస్తుంది. చెల్లింపు దారులు కేవలం 10 శాతం వడ్డీతో పాటు అసలు మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది.
‘పన్నులు చెల్లించండి .. నగరాభివృద్ధికి సహకరించండి’ అని కమిషనర్ ఆర్.వి. కర్ణన్ పిలుపునిచ్చారు. పౌరులు తమ వద్ద ఉన్న అవసరమైన పత్రాలతో మార్చి నెలలోని ఆదివారాల్లో సర్కిల్ కార్యాలయాలకు హాజరై, తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఈ రాయితీలు , పరిష్కార వేదికలు పన్ను చెల్లింపుదారులకు ఒక చక్కని అవకాశం.
