నటి రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. గత కొంతకాలంగా తనపై వస్తున్న అసభ్యకరమైన కామెంట్స్, వ్యక్తిగత దూషణలపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా తాను పవిత్ర కాశీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు దిగిన ఫోటోలపై కొందరు నెటిజన్లు చేసిన ‘నీచమైన’ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని వికృతానందం పొందే వారికి హెచ్చరిక చేస్తూ ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైలర్ అవుతోంది. ‘‘జంతువుల కోసమే NGO నడుపుతున్నాను.. మనుషుల కోసం నడపడం లేదు.. మీకు సమస్య వస్తే అడగాల్సింది, తిట్టాల్సింది నన్ను కాదు. మీరు ఓటేసిన నాయకులని అడగండి. వాళ్లని నిలదీయండి. అంతేకానీ, నాకు సంబంధం లేని వాటిని కూడా తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టడం మానుకోండి’’ అని రేణు దేశాయ్ (Renu Desai) హితవు పలికారు. ఇంకా ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ..
ఆ హక్కు మీకు ఎక్కడిది?
‘‘మీకు ఒక పౌరుడిగా ఈ దేశంలో ఎలాంటి హక్కులు ఉన్నాయో, నాకు అవే ఉన్నాయి. కేవలం నేను సినిమా పరిశ్రమలో ఉండటం ఒక్కటే మన మధ్య ఉన్న తేడా. అంత మాత్రాన నా వ్యక్తిత్వాన్ని కించపరిచే హక్కు మీకు ఎక్కడిది?’’ అని ఆమె ప్రశ్నించారు. సెలబ్రిటీలు కూడా మనుషులేనని, వారికి కూడా గౌరవం ఉంటుందనే కనీస స్పృహ ట్రోలర్లకు ఉండాలని ఆమె హితవు పలికారు. ట్రోలింగ్ చేసే వారిని ఆమె ‘నీచ రాక్షస మనుషులు’గా అభివర్ణించారు. ‘‘మీకు కనీసం తినడానికి తిండి లేకపోయినా పర్వాలేదు కానీ, ఇలాంటి ఆలోచనలు ఉండటం దారుణం. మీరు వాడే భాష, మీరు చేసే కామెంట్స్ మమ్మల్ని ఏమీ చేయవు.. అవి మీ సంస్కారాన్ని, మీ పెంపకాన్ని మాత్రమే బయటపెడతాయి’’ అని ఘాటుగా స్పందించారు. కేవలం తన గురించే కాకుండా, ఏ సెలబ్రిటీ లేదా ఏ రాజకీయ నాయకుడి గురించైనా సరే ఇలాంటి అసభ్యకర పదజాలం వాడటం మానవత్వం అనిపించుకోదని ఆమె అన్నారు. ‘‘సామాజిక మాధ్యమాల్లో అజ్ఞాతంగా ఉంటూ ఎదుటివారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం సంస్కారం కాదు. దమ్ముంటే.. నన్ను, నా పిల్లలని, నా చనిపోయిన అమ్మనాన్నలను తిట్టి.. ఇప్పుడు సమాజంలో చనిపోతున్న ఒక్కరినైనా బతికించండి’’ అంటూ ఆమె సవాల్ విసిరారు.కాశీ పర్యటన ఫోటోలకు అలాంటి కామెంట్సా?
రేణు దేశాయ్ ఈ వీడియోలో ఒక భయంకరమైన విషయాన్ని కూడా బయటపెట్టారు. తాను కాశీలో సంప్రదాయబద్ధంగా అమ్మవారిలా బొట్టు పెట్టుకుని దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే, దాని కింద కొందరు ‘రాత్రికి నీ రేటు ఎంత?’ అని కామెంట్ చేశారని ఆమె మండిపడ్డారు. ‘‘నేను అమ్మవారి దుస్తుల్లో, పవిత్రమైన బొట్టుతో ఉంటే.. అలాంటి ఫోటో కింద కూడా రేటు అడుగుతున్నారంటే మీ మనస్తత్వం ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోండి. అసలు ఆ మాట అడగడానికి మీకు నోరేలా వచ్చింది. రాయడానికి చేతులు ఎలా వచ్చాయి? అసలు కుక్కల గురించి నేను మాట్లాడుతుంటే.. ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా, నా ప్రైవేట్ పార్ట్స్‌కు లింక్ చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు’’ అంటూ షాకింగ్ విషయాన్ని ఆమె ఈ వీడియోలో ప్రస్తావించారు.మీ అమ్మ, నాన్న, అక్కా, చెల్లి దగ్గర తేల్చుకుంటా?
ఇన్‌స్టాగ్రమ్‌లో ఇకపై బూతు పదాలు వాడే అమ్మాయిలైనా, అబ్బాయిలైనా సరే.. ఎవరినీ వదలనని ఆమె హెచ్చరిక చేశారు. ‘‘ఇకపై ఎవరైనా బూతులు తిడితే, ఆ బూతులను స్క్రీన్ షాట్ తీసి, ఆ తిట్టిన వారి ఇంటిని కనుక్కుని వచ్చి మరీ వారి తల్లిదండ్రులు, అక్కా చెల్లెళ్లకు చూపిస్తా. ఇక ఇదే పనిగా పెట్టుకుంటా. నా ఇన్ఫ్లూయెన్స్ని ఇక దీని కోసం వాడతాను. ఇకనైనా సెలబ్రిటీలపై ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి’’ అని రేణు దేశాయ్ హెచ్చరించారు. మొత్తంగా చూస్తే.. రేణు దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఎంతో కాలంగా ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్న మహిళా సెలబ్రిటీలకు ఆమె మాటలు ఒక దైర్యాన్ని ఇచ్చాయనే చెప్పాలి. ఒక తల్లిగా, ఒక బాధ్యతాయుతమైన పౌరురాలిగా ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం సమాజంపై ఎంతైనా ఉంది. రేణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్‌కు అనసూయ కూడా లైక్ కొట్టారు.
